● అర్థరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ
కురవి: బక్రీద్ పండుగ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం అర్థరాత్రి కురవి చెక్ పోస్టు ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని, చెక్ పోస్ట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించి అవసరమైన పత్రాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వాహనాల పై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఎస్పీ శబరీష్ అన్నా రు. బక్రీద్ పండుగ సందర్భంగా గో రక్షకులు, హిందూ సంఘాల ప్రతినిధులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాద్యమాల్లో అసత్య ప్ర చారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 చెక్ పోస్టుల వద్ద 24 గంటలు పోలీస్ నిఘా కొనసాగుతోందని తెలిపారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే జిల్లా కంట్రోల్ రూమ్ 87126 56999, ఎస్పీ 87126 56900, మానుకోట డీఎస్పీ 87126 56904, తొర్రూరు డీఎస్పీ 87126 56905, డయల్ 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.


