రేగొండ/నడికూడ: కుటుంబీకులతో కలిసి ఆనందంగా పెళ్లికి వెళ్లొస్తున్న ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రానికి చెందిన ఊర రాజు తన భార్య మౌనిక, కూతురు తన్విత, కుమారుడు హిమాన్షు(09)ను తన అన్న కొడుకు పెళ్లికి కారులో ములుగు జిల్లా ఇంచర్లకు పంపించాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్న క్రమంలో నారాయణపూర్ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హిమాన్షుతో పాటు తల్లి, అక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆరెపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. హిమాన్షును మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కాగా, నిన్నమొన్నటి వరకు నతమ కళ్లెదుట ఆడుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.హిమాన్షు మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది.
కారు బోల్తా పడి బాలుడి మృతి
నారాయణపూర్ శివారులో ఘటన


