బయ్యారం: విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించే సర్పంచ్‌ల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పాఠశాలల హెచ్‌ఎంలు విజయవంతం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. మంగళవారం బయ్యారంలోని జెడ్పీబాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు, నాణ్యమైన విద్యపై గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పాత్రను బలపర్చడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు. పాఠశాలల అవసరాలు, మౌలిక వసతులు, హాజరు నమోదు పెంపునకు సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. విద్యలో నాణ్యత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఏసీజీ శ్రీరాములు, ఎఫ్‌ఏఓ శంకర్, ఎంఈఓ లక్ష్మణ్‌రావు, హెచ్‌ఎం ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.


