అజ్ఞాతం వీడిన పసునూరి | - | Sakshi
Sakshi News home page

అజ్ఞాతం వీడిన పసునూరి

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

సీపీఐ (మావోయిస్ట్‌) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌ అలియాస్‌ సంతోశ్‌ ఎట్టకేలకు ఉద్యమ బాటను వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్‌ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు.

సోమిడి నుంచి జార్ఖండ్‌ వరకు..

పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న రాడికల్‌ విద్యార్థి సంఘం, రాడికల్‌ యూత్‌ లీగ్‌లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణ దేవ్‌, గోపగాని అయిలన్న అలియాస్‌ మహేశ్‌తో కలిసి వరంగల్‌ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్‌గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగా రం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివి ధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకుని ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్‌లో మావో యిస్ట్‌ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు.

ఉమ్మడి వరంగల్‌ నుంచి చివరి లొంగుబాటు

కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్‌ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్‌ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్‌ సంతోశ్‌ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్‌ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్‌ ఈస్ట్‌ రీజినల్‌ బ్యూరో టెక్నికల్‌ విభాగం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌, అలియాస్‌ సంతోశ్‌ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్‌ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్‌ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్‌ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌, సంతోశ్‌ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్‌ రహిత జిల్లాగా మారిందంటున్నారు.

జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్‌

అగ్రనేత నరహరి అలియాస్‌ విశ్వనాథ్‌

పార్టీ మెంబర్‌ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు..

నాలుగున్నర దశాబ్దాలపాటు

ఉద్యమంలో పనిచేసిన అనుభవం

జార్ఖండ్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేసి

లొంగిపోయిన నేత

Advertisement
 
Advertisement
Advertisement