గూడూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న మక్క రైతులు
గూడూరు: కాంటాలు పూర్తయినా మక్కలను తరలించడం లేదని, 20రోజులైనా కాంటాలు పెట్టడంలేదని నిరసిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. దీంతో గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరగంటకు పైగా ఆందోళన కొనసాగడంతో విషయం తెలుసుకున్న సీఐ వినయ్‌కుమార్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. రైతులు రవిసింగ్ రాథోడ్, బోడ చంద్రుతో పాటు పలువురు రైతులు 20రోజుల క్రితం కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలు కాంటా అయినా, లారీలు రావడం లేదని చెప్పారు. దీంతో వెంటనే సీఐ మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడి, వెంటవెంటనే లారీలు వచ్చేలా, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో.. వారు ఈ రోజు లారీలు వస్తున్నాయని తెలి పారు. దీంతో సీఐ రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆ తర్వాత పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లిన సీఐ కాంట్రాక్టర్‌తో మాట్లాడి లారీలు వచ్చేలా చేశారు.


