మహబూబాబాద్ రూరల్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో భక్తులు మంగళవారం భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మొదటగా స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అంజన్నకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన వాహనంతో కూడిన వేదికపై శ్రీ అభయాంజనేయ స్వామిని కొలువుదీర్చి తమలపాకులు, గజమాలతో అలంకరించి పూజించారు. అక్కడి నుంచి శ్రీ హనుమాన్ వానర యువసేన ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో ర్యాలీ చేపట్టి ప్రధాన పురవీధుల మీదుగా జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరవశించిపోయారు. చివరగా హనుమంతుని గడ్డలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ర్యాలీ ముగించారు.


