బయ్యారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీంతో మంగళవారం ఇల్లెందు, కొత్తగూడెం ప్రధాన రహదారిపై కిలోమీటరు మేర ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు దీరాయి. కొనుగోలు ఆలస్యం వల్ల మూడు రోజుల నుంచి రైతులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన మక్కల బస్తాలను బయ్యారంలోని ఏఎంసీ గోడౌన్‌లో దిగుమతి చేస్తుండడంతో అధికసంఖ్యలో మక్కల ట్రాక్టర్లు రహదారిపై బారులుదీరాయి.
గార్లలో నిలిచిన
సింగరేణి ఎక్స్‌ప్రెస్
గార్ల: విద్యుత్ సాంకేతిక లోపంతో సిర్పూర్– కాగజ్‌నగర్ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ మంగళవారం గార్ల రైల్వేస్టేషన్ రెండు గంట పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓహెచ్‌ఈ పవర్ సప్లై గార్ల నుంచి మహబూబాబాద్ వరకు నిలిచిపోవడంతో పలు స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా, ప్ర యాణికులకు గార్లలోని ఆర్యవైశ్య సంఘం సభ్యు లు వాటర్, అరటిపండ్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు వచ్చి సమస్యను పరిష్కరించడంతో ట్రైన్ ముందుకు సాగింది. అలాగే మానుకోట రైల్వే స్టేషన్‌లో ఖమ్మం వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ గంటపాటు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.


