● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : మానుకోట వ్యవసాయ మార్కెట్‌లోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేలాది మక్కల బస్తాలు నిల్వ ఉన్నాయి. దీంతో రైతుల పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ‘లారీలు రావు.. బస్తాలు పోవు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, జిల్లా అధికారులు మంగళవారం స్పందించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహస్వామి మానుకోట మార్కెట్ యార్డును సందర్శించారు. మక్కల బస్తాలు నిల్వ ఉన్న షెడ్లను పరిశీలించి, ఏఎంసీ పరిధిలో ఉన్న నాబార్డు గోదాము, ఇతర గోదాములను సందర్శించి పరిశీలించారు. మక్కలను త్వరగా కొనుగోలు చేసి ప్రభుత్వ గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతిరమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ సుజన్ బాబు, డైరెక్టర్లు దేశెట్టి మల్లయ్య, జంగాల నరసింహారావు, వేమిశెట్టి యాకాంబ్రం, పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


