హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు వెళ్లేందుకు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఈ మేరకు ఆప్షన్లు ఎంచుకున్నారు. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుందో.. వెళ్లాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఊహించని విధంగా ఆర్‌పీడీసీఎల్‌కు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 30 నుంచి ఈ నెల 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు మొత్తం 2వేల మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షనల్ కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు.
సీనియార్టీ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక
ఆప్షన్‌లో పొందుపరిచిన వివరాలు.. వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. ఈ జాబితాను పరిశీలించి ఆప్షన ఇచ్చిన వారి నుంచి సీనియార్టీ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ నెల 13(నేడు)న ఉద్యోగులను ఎంపిక చేసి బదిలీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరు ఈ నెల 15న ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో రిలీవ్ అయి, 18న ఆర్‌పీడీసీఎల్‌లో రిపోర్టు చేయాలి. వీరికి 19న పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 25వ తేదీ లోపు పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. దీంతో మూడో డిస్కం పూర్తి స్వరూపం ఈ నెల 25న రానుంది.
1,252 మంది ఉద్యోగులు ఆప్షన్..
టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్‌మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్ మెన్లు 271 మంది, లైన్‌మెన్లు 116, లైన్ ఇన్‌స్పెక్టర్లు 31, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు 4, ఫోర్‌మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్లు 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్లు 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు 66, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు 10, అకౌంట్స్ ఆఫీసర్లు 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు 15, పర్సనల్ ఆఫీసర్లు 2, ఆర్టిజన్ గ్రేడ్‌కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు 6, ఒకరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ఆర్‌పీడీసీఎల్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం
ఆర్‌పీడీసీఎల్‌కు వెళ్తున్న ఉద్యోగులకు ఒక్క సారి మాత్రమే సత్వర పదోన్నతికి మినహాయింపు ఇస్తారు. బదిలీ ద్వారా పదోన్నతి పొందిన ఉద్యోగులు ఐదేళ్ల పాటు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం లేదు. అదే విధంగా కంపెనీ బయటకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి అర్హులు కారు. ఇప్పటికే ఆర్‌పీడీసీఎల్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు.
కంపెనీకి కావాల్సిన ఉద్యోగులు 2 వేలు
ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు.. పరిశీలన పూర్తి
నేడు జారీ కానున్న బదిలీ నియామక
ఉత్తర్వులు
ఆర్‌పీడీసీఎల్‌కు బదిలీ అయిన వారు 15న రిలీవ్
ఈ నెల 25 లోపు ఉద్యోగంలో చేరాలి


