కాళేశ్వరం : జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీనది అంత్య పుష్కరాల్లో నిరంతర విద్యుత్ అందించనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం కాళేశ్వరంలోని పుష్కర ఘాట్, బస్టాండ్ ప్రాంతం, పార్కింగ్ ఏరియాలో చేపడుతున్న విద్యుత్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో సంబంధిత పనుల్లో ఇప్పటికే అధిక భాగం పూర్తయ్యాయని, మిగతా పనులన్నీ ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. సీఎండీ వెంట సీఈ రాజు చౌహాన్, ములుగు ఎస్‌ఈ బేతి భిక్షపతి, కాటారం డీఈ (ఆపరేషన్) నాగరాజు, డీఈ (టెక్నికల్) జగదీశ్, డీఈ సదానందం, లైన్ ఇన్‌స్పెక్టర్లు సదానందం, కిరణ్ కాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి


