సహజీవనంలో విషాదం.. | - | Sakshi
Sakshi News home page

సహజీవనంలో విషాదం..

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

పెట్రోలు పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

పరిస్థితి విషమం.. జిల్లా ఆస్పత్రికి తరలింపు

జనగామ: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. సీఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పసుల అఖిల్‌ కుటుంబం కొన్నేళ్లుగా జనగామలో నివాసముంటోంది. ఈ క్రమంలో జనగామ మండలం పెద్దపహాడ్‌ శివారు ఓ తండా(తల్లిగారు), నర్మెట మండలానికి(అత్తగారు)కు చెందిన ఓ వివాహితతో అఖిల్‌ ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరి జీవనం సాగిస్తున్న క్రమంలో అఖిల్‌ పరిచయమయ్యాడు. రెండు నెలల క్రితం సదరు మహిళ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్‌ సమీపంలో కూల్‌డ్రింక్‌ షాప్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో అఖిల్‌ ఆమైపె అనుమానం పెంచుకుని తరచూ గొడవలు పడేవారు. దీనిపై బాధిత మహిళ ఇప్పటి వరకు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అఖిల్‌, అతని తల్లికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నాలుగు రోజులకోసారి ఇద్దరు గొడవలు పడడం, మళ్లీ కలిసి ఉండడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో అఖిల్‌కు అనుమానం పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాటిల్‌లో పెట్రోలు తీసుకుని కూల్‌డ్రిండ్‌ షాప్‌నకు చేరుకున్నాడు. అక్కడికి రాగానే మహిళతో వాగ్వాదం జరగగా ఆగ్రహంతో తన శరీరంపై పెట్రోలు పోసుకుని అక్కడే నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయాలతో పడిపోయిన అఖిల్‌ను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అఖిల్‌ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement