సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల్లో బదిలీల సందడి నెలకొంది. దీంతో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 8వ నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత స్క్రూట్నీ పూర్తి చేసి ఈనెల చివర వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
40శాతం మందికే అవకాశం..
ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో బదిలీకి అర్హత ఉన్నా.. వారిలో 40శాతం మందికి మాత్రమే స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందుల గ్రేడ్–1 కార్యదర్శులు 14మంది, గ్రేడ్–2 క్యాదర్శులు 27మంది, గ్రేడ్–3 కార్యదర్శులు 28 మంది ఉన్నారు. వీరి బదిలీ ప్రక్రియ జోనల్ స్థాయిలో ఉంటుంది. కాగా, కమిషనర్ పరిధిలో బదిలీల ప్రక్రియ ఉంటుంది. ఇక మిగిలిన గ్రేడ్–4 కార్యదర్శులు 330 మంది ఉన్నారు.73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భార్యాభర్తల ఒకేచోట పనిచేసే అవకాశం, మెడికల్ గ్రౌండ్ కలిపి మొత్తం 40శాతం అంటే 132 మందికే బదిలీ అయ్యే అవకాశం ఉంది.
సర్వీస్ జాబితా సిద్ధం..
పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు అనుగుణంగా జిల్లాలో బదిలీలు చేపట్టేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిధిలో గ్రేడ్–4 కార్యదర్శుల బదిలీ మాత్రమే జరుగుతుంది. జిల్లాలో మొత్తం 330 మంది గ్రేడ్–4 కార్యదర్శులు ఉండగా.. ఇందులో 132 మందికే అవకాశం ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం ఒకే గ్రామంలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. అదేవిధంగా రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు 185 మంది ఉన్నారు. వీరికి తోడు స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరిలో 40శాతం మాత్రమే బదిలీ చేస్తారు. ఇలా 132 మంది మాత్రమే బదిలీ అవుతారు. అంటే ఇంకా అర్హత ఉన్నవారిలో కూడా 53 మందికి అవకాశం రాదు.
ఏజెన్సీ కార్యదర్శుల్లో బిక్కు బిక్కు..
పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లాలోని కార్యదర్శులను తాము పనిచేస్తున్న నియోజకవర్గం నుంచి డిప్యుటేషన్‌పై ఇతర నియోజకవర్గాలకు పంపించారు. కాగా చిన్న పిల్లల తల్లులు, ఆరోగ్య సమస్యలు, వయస్సు మీద పడిన వారు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఉన్నారు. మరికొందరు డిప్యుటేషన్‌పై ఆయా ప్రాంతాలకు వెళ్లలేమని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ సాధారణ బదిలీల సందర్భంగా మీకు స్థానచలనం కల్గుతుందని చెప్పారు. ముందు మీరు విధుల్లో చేరండి.. తర్వాత మీ పరిస్థితి ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు సాధారణ బదిలీలు అవుతున్నా.. సీనియార్టీ జాబితాలో మైదాన ప్రాంతం ఖాళీలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే.. ఏజెన్సీల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన కార్యదర్శుల్లో అత్యధిక జీపీలకు కొత్తవారు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికమే అనుకొని డిప్యుటేషన్‌పై వెళ్లిన వారు అక్కడే పనిచేయాల్సి వస్తుందని కార్యదర్శుల్లో చర్చ జరుగుతోంది.
నాలుగేళ్ల సర్వీసు నిండిన వారిలో
40శాతం పంచాయతీ కార్యదర్శులకే స్థానచలనం అవకాశం
ఈనెల చివరి వరకు ప్రక్రియ
ఇప్పటికే డిప్యుటేషన్‌పై వెళ్లిన పీఎస్‌లకు అక్కడే విధులు


