● తొర్రూరు ఆర్డీఓ గణేష్
● ప్రజావాణిలో 13 వినతులు స్వీకరణ
తొర్రూరు: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి 13 దరఖాస్తులు అందాయి. దానిలో 10 భూ సంబంధిత, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్, సర్వే శాఖకు సంబంధించినవి ఒక్కో దరఖాస్తు వచ్చాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు ఆర్డీఓకు అందించారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి, ఏఎల్‌ఓ రవి, సీడీపీఓ కమలాదేవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కె.అనిల్‌కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు ఇలా..
ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి: పెద్దవంగర వాసులు డివిజన్ పరిధి పెద్దవంగరలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన కొంత భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని, ఆ స్థలంలో ప్రహరీ సైతం నిర్మించాడని గ్రామస్తులు తెలిపారు. భూమిని ఆక్రమించడమే కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల వెనకాల ఉన్న మొక్కలు, నీటి సరఫరా పైపులను ధ్వంసం చేశాడని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించిన గ్రామ దళితులకు ఆక్రమణదారు కోర్టు నుంచి నోటీసులు పంపించాడన్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.
నకిలీ భూ పత్రాలు సృష్టించారు : బాధితుడు ధర్మా నాయక్
తొర్రూరు మండలం కంఠాయపాలెం శివారు సీత్యాతండాకు చెందిన బానోతు ధర్మానాయక్‌కు తండాలో వారసత్వంగా సంక్రమించిన 2 ఎకరాల భూమి ఉంది. సదరు భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. సదరు భూమిపై కన్నేసిన తండాకు చెందిన ఓ వ్యక్తి నకిలీ భూ పత్రాలు సృష్టించి దాన్ని కాజేసేందుకు రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్నాడు. భూమి సాగు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న సదరు వ్యక్తికి పట్టా చేయకుండా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఆర్డీఓను కోరారు.


