రైతుల ఆందోళన
తొర్రూరు: మక్కల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా సాకులు చెబుతూ కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ సోమవారం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదు ట రైతులు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు, వాహనాల కిరాయి ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే, కొనుగోలు చేయడం లేదన్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నెల రోజు లుగా ఎండలో మాడుతున్నామని, అకాల వర్షాలు కురుస్తున్నా పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు ఎస్సైలు అంజమ్మ, ఖాదర్‌పాషా ఆందోళన స్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. లారీలు ఆలస్యంగా రావడం, గన్నీ సంచుల కొరత వల్ల మక్కల కొనుగోళ్లలో జాప్యం జరిగిందన్నారు. తక్షణమే కొనుగోళ్లు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని హామీనివ్వడంతో రైతులు శాంతించారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారంపై మున్సిపల్ సిబ్బంది దృష్టి సారించాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్ పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సాధారణ సమావేశంలో 32 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చ జరిపారు. పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. చెత్త సేకరణ వాహనాలకు వెంటనే మరమ్మతులు జరిపి వీధుల్లో పూర్తిస్థాయిలో చెత్త సేకరణ జరపాలని, డ్రైవర్లతో పాటు సిబ్బందిని వెంటనే నియమించాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ అనుమతిస్తే పారిశుద్ధ్య పనులను ప్రత్యేక ఏజెన్సీకు అప్పగిస్తామని కమిషనర్ బి.నిరంజన్ తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు చైర్‌పర్సన్ రాజకుమారి తెలిపారు. వైస్ చైర్‌పర్సన్ లావణ్యాశ్రీనివాస్, మున్సిపల్ ఏఈ శృతి, సీనియర్ అసిస్టెంట్ లోకేష్ పాల్గొన్నారు.
విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని డీఐఈఓ మదార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్‌లో ఫెయిల్‌అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశామని, ఈ నెల 13నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐడీపీ, ఐఎఫ్‌పీ డిజిటల్ టీవీలను ప్రారంభించి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. ప్రిన్సిపాల్స్ సదానందం, గణేష్, అధ్యాపకులు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: బేగంపేట, రామాంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఒకటో తరగతిలో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు జిల్లాలో నిరుపేద గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి దేశీరాంనాయక్ సోమవారం తెలిపారు. దరఖాస్తు ఫారాలు నేరుగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అందిస్తామని, ఈ నెల 18న సాయంత్రం 4గంటల వరకు గిరిజన కార్యాలయంలో తిరిగి సమర్పించాలన్నారు. ఈ నెల 22న కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో లక్కీడ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు 1–6–2019 నుంచి 31–5–2020 మధ్య జన్మించి ఉండాలన్నారు.


