నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం | - | Sakshi
Sakshi News home page

నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం

గుండెపోటుతో డీఏఓ మృతి

నర్సంపేట రూరల్‌: నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. డీఏఓ (డివిజనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌)గా విధులు నిర్వర్తిస్తున్న తిప్పరి శ్రీనివాస్‌ (57) గుండెపోటుతో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన తిప్పరి శ్రీనివాస్‌ వరంగల్‌ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో మూడు సంవత్సరాల నుంచి డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయానికి శ్రీనివాస్‌ విధులకు హాజరయ్యారు. విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

మర్రిపల్లిగూడెంలో ఘటన

కమలాపూర్‌ : ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బీనవేని ఉమ, భిక్షపతి దంపతుల చిన్న కుమారుడు అజయ్‌(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. సోమవారం తన బంధువులు ఇద్దరితో కలిసి గ్రామంలోని పెద్దిరెడ్డి చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఈసమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మధు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ తెలిపారు.

అక్రమ మట్టి తవ్వకాలే కారణం..

అజయ్‌ మృతికి అక్రమ మట్టి తవ్వకాలే కారణమని గ్రామస్తులు ఆ రోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి, మొరం తవ్వకా లు చేపడుతున్నారని, దీంతో చెరువులో ప్రమాదకరంగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. ఆ గుంతల్లో పడి గతేడాది ఓ మహిళ, తాజాగా అజయ్‌ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రా ణాలు పోకముందే అధికారులు స్పందించి వెంటనే చెరువులో అక్రమ మట్టి, మొరం తవ్వకాలను అరికట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement