ప్రజల వద్దకు పోలీస్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల వద్దకు పోలీస్‌

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

సాక్షి, మహబూబాబాద్‌:

● ఇటీవల కాలంలో హెల్మెట్‌ వినియోగం, అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శబరీష్‌ కురవి మండంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజాప్రతినిధుల రాకకోసం ఎదురుచూస్తున్న సందర్భంలో ఓ మహిళ ఎస్పీ వద్దకు వచ్చి తన సమస్యను చెప్పుకున్నారు. దీంతో స్పందించిన ఆయన పోలీస్‌ అధికారులను పిలిచి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ సమస్యను పరిష్కరించారు. అందుకు ఆమె పోలీస్‌ బాస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెసేజ్‌ పంపించింది.

● కేసముద్రం మండలంలో మహిళా సమాఖ్య సమావేశం జరుగుతుంటే జిల్లా షీ–టీమ్‌ బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ మహిళలతో మమేకమై.. వారి బాగోగులు తెలుసుకుంది. ఈ సందర్భంగా ఓ మహిళ తనకు ఓ సమస్య ఉందని ఫోన్‌ నంబర్‌ తీసుకుంది. తర్వాత షీ–టీమ్‌ ఎస్సై సునందకు ఫోన్‌ చేసి.. తమది పరువుగల కుటుంబం. భర్త ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి తనకు తరచూ ఫోన్‌ చేసి లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని ఏడుస్తూ వివరించింది. దీంతో వేధింపులకు గురిచేసే వ్యక్తి ఫోన్‌ నంబర్‌ తీసుకున్న ఎస్సై సదరు వ్యక్తికి ఫోన్‌ చేసి స్టేషన్‌కు పిలిపించింది. తాను చేసిన వెలిక చేష్టల వివరాలు చెప్పింది. మరోసారి ఆమెకు ఫోన్‌ చేస్తే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించింది. దీంతో ఆ సమస్య సమసిపోయింది.

● కురవి మండలంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన షీ–టీమ్‌ బృందం మహిళలతో మాట్లాడి ఇబ్బందులుంటే ఫోన్‌ చేయమని కోరింది. ఫోన్‌ నంబర్‌ తీసుకున్న ఓ మహిళ మరుసటి రోజు షీ–టీమ్‌కు ఫోన్‌ చేసింది. తన ఇంటిపక్కన యువకుడు తన కూతురును వేధింపులకు గురి చేస్తున్నాడని, ఎన్ని సార్లుచెప్పినా.. మార్పు రాలేదని, మెస్సేజ్‌లు పంపిస్తున్నాడని వివరించింది. దీంతో పోలీస్‌ స్టేషన్‌కు యువకుడిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి అమ్మాయి జోలికి వెళ్తే కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో యువకుడు తన ప్రవర్తనన మార్చుకోవడంతో యువతి సమస్య తీరిపోయింది.

ఇలా ఒకప్పుడు పోలీసుల పేరు చెబితేనే భయపడే జనం ప్రస్తుతం ఏ సమస్య ఉన్నా పోలీసులకు చెబితే పరిష్కారం అవుతుందనే విధంగా పరిస్థితి మారింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కరించడం ద్వారా ప్రజలకు సైతం పోలీసులపై నమ్మకం పెరిగింది. ఈనేపథ్యంలో జిల్లాలో పోలీసులు ప్రజలకు చేరువ అవుతున్న తీరుపై కథనం.

గ్రామాల్లోకి పోలీస్‌..

పాత పద్ధతిన కాకుండా వినూత్న రీతిలో పోలీసింగ్‌ చేయాలని భావించిన ఎస్పీ.. ప్రజల మధ్యకు వెళ్తేనే సమస్యలు తెస్తాయి. వాటి పరిష్కారం సులువు అవుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పండుగలు, క్రీడలు, విగ్రహాల ఆవిష్కరణ, రైతులు, యువజనుల సమావేశాల్లో శాంతి భద్రతల పరిష్కణ చూస్తూనే ప్రజలతో మమేకం కావాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా యూరియా, గ్యాస్‌ కొరత వంటి సమస్యలు వచ్చినప్పుడు గుంపులను చెదరగొట్టడమే కాకుండా.. వారితో మమేకమై.. అసలు సమస్య ఎక్కడ వస్తుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమస్య పరిష్కారానికి మార్గం దొరికింది. సమస్య సమసి పోయిందని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. అదే విధంగా హోం గార్డు స్థాయినుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు, గ్రామాల్లో పర్యటన, ప్రజా ప్రతినిధులతో మమేకం వంటి ప్రక్రియ మంచి ఫలితాలను ఇచ్చింది. గంజాయి వినియోగం, రవాణా అదుపులోకి తేవడానికి దోహద పడింది. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం మూలంగా సీసీ కెమెరాల కొనుగోళ్లు, హెల్మెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు ముందుకు రావడం ఇందుకు నిదర్శనం.

ప్రజల్లో ఒకరిగా..

పోలీసులంటే సమాజంలో ఉన్న అభిప్రాయం పోవాలి. వాళ్లు వేరు కాదు..సమాజంలో వారు ఒకరు అనే అభిప్రాయం రావాలన్నదే పోలీస్‌శాఖ ఉద్దేశం. అప్పుడే వారి సమస్యలు చెబుతారు.వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఈ ఉద్దేశంతోనే ఫ్రెండ్లీ పోలీస్‌, విలేజ్‌ పోలీసింగ్‌ వ్యవస్థను బలోపేతం చేశాం. ప్రజలతో మమేకం కావడం. సామాజిక రుగ్మతులను నిర్మూలించడంలో ప్రజల సహకారం తీసుకుంటూ ముందుకెళ్తున్నాం.

– శబరీష్‌, ఎస్పీ

ప్రజలతో మమేకం..

సమస్యల పరిష్కారానికి ప్రయత్నం

చట్టాలపై అవగాహన,

సామాజిక రుగ్మతుల నివారణ

వినూత్నరీతిలో జిల్లా పోలీస్‌శాఖ

కార్యక్రమాలు

మహిళల గుంపుతో

షీ–టీమ్‌

మహిళలకోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి కిందిస్థాయికి చేరడం లేదు. అయితే జిల్లాలోని షీ–టీమ్‌ మాత్రం మహిళల గుంపు ఎక్కడ ఉంటే అక్కడ వాలి.. చట్టాల గురించి చెప్పడం పరిపాటిగా మారింది. సాధారణంగా స్కూల్స్‌, కాలేజీల్లోని విద్యార్థిణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కానీ జిల్లాలోని షీ–టీమ్‌ మాత్రం మహిళలకు ఎక్కడ పనిచేస్తే అక్కడ.. ప్రధానంగా మార్కెట్‌లో ధాన్యం ఊడ్చేవాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సమావేశాలు.. మొదలైన చోట్లకు వెళ్లడం. మహిళల చట్టాలు. వాటిని వినియోగించుకోవడం, లైంగిక వేదింపులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులతో ఇబ్బందులు పడుతున్న వారికి పోలీస్‌ ఏవిధంగా సహాయ పడుతుందో చెప్పడం. వారితో మమేకం కావడం పరిపాటిగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement