● ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో
భాగంగా నిర్వహణ
● 17వ తేదీ వరకు కార్యక్రమాలు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతమే ధ్యేయంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యావారోత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ ప్లాన్‌కు సంబంధించిన విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని గురుకులాల విభాగాల్లో అడ్మిషన్ల పెంపు, విద్యా ప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిజిటల్ క్లాస్‌లను బలోపేతం చేయడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్‌లో అమలుకు జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు.
వారోత్సవాలు ఇలా..
● 11వ తేదీన మొదటి రోజు పునాది దినోత్సవం నిర్వహించాలి. పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన.. పీఎంశ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాలను ప్రారంభం. కోడింగ్, ఆర్ట్స్, యోగా, క్రీడల్లో ఇతర కార్యక్రమాల్లో విద్యార్థులకు శిక్షణ నిర్వహించాలి.
● 12వ తేదీన రెండో రోజు పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణతో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలకు రెమెడియల్ క్యాంప్‌లు ప్రారంభించాలి. వారి పురోగతి సమీక్ష, మధ్యాహ్న భోజనం అందించాలి.
● 13వ తేదీన గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించాలి. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలతో అవగాహన కల్పించాలి.
● 14వ తేదీన గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను బడిలో చేర్పించాలి. తల్లిదండ్రులు, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో సమావేశాలు, సమ్మేళనం నిర్వహించాలి. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహించాలి. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయాలి. విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయాలి.
● 15వ తేదీన పాఠశాల్లో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించి. గ్రంథాలయాలు– జ్ఞాన హృదయం నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టాలి. అంబేడ్కర్ లాంటి మహనీయుల పుస్తకాలు ప్రదర్శించాలి. ఉత్తమ పాఠకులకు గుర్తింపు, పుస్తక దానం శిబిరాలు నిర్వహించాలి.
● 16వ తేదీన విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు, కోలాటం, ఒగ్గుకథలు సంప్రదాయ కళల ప్రదర్శనలు, కళా వైభవం ఆర్ట్ అండ్ క్రాప్ట్ దినోత్సవం, పీఎం శ్రీపాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. జానపద కళారూపాల ప్రదర్శనలు, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఉత్తమ చిత్రపటాలు, శిల్పాలను ఎంపిక చేయాలి.
● 17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించాలి. జిల్లాస్థాయిలో పదో తరగతి మొదటి ముగ్గురు టాపర్లకు పురస్కారాలు, రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసపత్రాలు అందించాలి. విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా నిర్వహంచాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలి.
ఘనంగా నిర్వహిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యయ్యేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తాం.
– అలువాల సత్యనారాయణమూర్తి, డీఈఓ


