మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సీహెచ్.మదార్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్లతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 14 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 3వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పరీక్ష కేంద్రాల పీఎస్, డీఈఓలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజలకు రక్షణ లేకుండాపోయింది’
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలకు రక్షణ కరువైందని మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాజీ ఎంపీ కవితతో కలిసి మాట్లాడారు. హైదరాబాద్‌లో కొత్తగా గన్ కల్చర్, గంజాయి, డ్రగ్ కల్చర్ అలవాటైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. మహిళలు, యువతులపై దారుణాలు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి సమీక్షలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. హోంమంత్రి పదవి ఆయన వద్దనే ఉన్నా ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసులు పెట్టకుండా తప్పుదోవ పట్టించాలని చూశారని విమర్శించారు. కేసులు పెట్టకుండా బాలిక తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎట్టకేలకు కేసు నమోదు చేశారని అన్నారు.
వారోత్సవాలను
జయప్రదం చేయాలి
నెల్లికుదురు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో జరిగే ప్రత్యేక విద్యా వారోత్సవాలను జయప్రదం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో జరిగే అభివృద్ధి పనుల స్థల పరిసరాలను ఆదివారం ఆయన పరిశీలించారు. సోమవారం ఎమ్మెల్యే మురళీనాయక్ ముందుగా కేజీబీవీఓ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత మోడల్ స్కూల్‌లో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌సీ సంతోష్, జీసీడీఓ విజయకుమారి, ఎస్‌ఓ సుమలత, సుధాకర్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి ఎంపిక
కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణులపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించబోతున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందినట్లు వెల్లడించారు. ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు.


