● ఈ నెల 25 వరకు నిర్వహణ
● జిల్లాలో 18 పాఠశాలలు ఎంపిక
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని 18 పీఎంశ్రీ పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక శిక్షణ శిబిరంలో 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈ శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
రూ.9 లక్షలు మంజూరు
వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఒక పీఎంశ్రీ పాఠశాలకు రూ.50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ నిధులను ఆ పాఠశాల హెచ్‌ఎంల అకౌంట్లకు జమచేశారు. మెటీరియల్ కలర్స్ స్కేచ్ తదితరాలకు రూ.10వేలు, వంట సహాయకులకు రూ.4వేలు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన నలుగురు కోచ్‌లకు రూ.3 వేల చొప్పున రూ.12 వేలు చెల్లించాలి. శిక్షణలో నిర్వహించే ఆటలు, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, యోగా, కథ చెప్పటం, వ్యక్తిత్వ వికాసం, చెస్, ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్రీడలు, క్వీజ్‌లు, మాక్ పార్లమెంట్, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు ముగిసిన తర్వాత ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని విద్యాశాఖ అధికారుల సూచించారు.
అన్ని పాఠశాలల విద్యార్థులకు ఎంట్రీ..
ఈ వేసవి శిక్షణ శిబిరం పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు కాకుండా అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా అవకాశం కల్పించారు. శిక్షణ శిబిరాలను సెక్టోరల్ ఆఫీసర్లు, ఎంఈఓలు ప్రతీరోజు పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు వేసవి వేడి నుంచి ఉపశమం కలిగించి ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణ ఇచ్చేలా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శిబిరాలు నిర్వహించే పాఠశాలలు ఇవే..
బయ్యారం మండలం జీకేపేటలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, డోర్నకల్ మండలం చిలుక్కోడు పీఎంశ్రీ మోడల్ స్కూల్, డోర్నకల్ జెడ్పీహెచ్‌ఎస్, సిరోలు కాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్, కంబాలపల్లి జెడ్పీహెచ్‌ఎస్, మానుకోట జెడ్పీహెచ్‌ఎస్, మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్, గూడూరు మండలంలోని పోనుగోడు జెడ్పీహెచ్‌ఎస్, కేసముద్రం స్టేషన్ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, నెల్లికుదురు మోడల్ స్కూల్, నర్సింహులపేట పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, చిన్నగూడురు మండలంలోని జయ్యారం పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్, మరిపెడ మండలంలోని సీతారాంపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్, దంతాలపల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, తొర్రూరు మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్, తొర్రూరు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, పెద్దవంగర మండలంలోని అవతాపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, మరిపెడ మోడల్ స్కూల్‌లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.


