మహబూబాబాద్ అర్బన్ : భారతీయ సంప్రదాయ ప్రాచీన నృత్యం కూచిపూడి. దేశంలో ఈ నృత్యానికి అంత్యంత ప్రాధాన్యం ఉంది. అయితే ఈ నృత్యంలో రాణించడం అనుకున్నంత సులువేం కాదు. ఎంతో సాధన చేయాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. అప్పుడే ఇందులో ప్రావీణ్యం సాధిస్తారు. ఇలాంటి ఆసక్తే చూపుతూ మంచి నృత్యకారిణులుగా పేరు తెచ్చుకుంటున్నారు మానుకోట జిల్లా కేంద్రలోని చిన్నారులు, యువతులు, మహిళలు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రముఖుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంటున్నారు.
తల్లీకూతుళ్ల అసాధారణ ప్రతిభ..
జిల్లా కేంద్రంలోని పాతబజారు హరిజనవాడకు చెందిన బుర్ర రాజశేఖర్, ఉమ దంపతులు. రాజశేఖర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ఉమ ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా 2023 నుంచి పెద్ద కూతురు కాత్యాయని విద్మహేకు, 2024 నుంచి చిన్న కూతురు మోక్షదాయిని విద్మహేకు కూచిపూడి నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరితోపాటు తల్లి ఉమ కూడా కూచిపూడి నేర్చుకుంటోంది. ఇటీవల వరల్డ్ రికార్డు బుక్‌ఆఫ్ ఇండియాలో మొదటిసారి ప్రదర్శనలు చేసి ముగ్గురు అవార్డులు అందుకున్నారు. దీంతో రాజశేఖర్, ఉమ దంపతుల బంధుమిత్రులు అభినందించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో
రాణిస్తున్న అక్కాచెల్లి..
జిల్లా కేంద్రంలోని బుక్కబజారుకు చెందిన కనమర్లపూడి ఆనంద్, ఆశ్లేష దంపతుల కూతుళ్లు ఖుషి, ఆరుషి 2023 నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఖుషి 7, ఆరుషి 4వ తరగతి చదువుతోంది. వీరు కూచిపుడిలో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి, మహారాష్ట్రలోని షిర్డీ, నెల్లూరు, ఉప్పల్‌లోని మినీ శిల్పరామంలో పలు ప్రదర్శనలు చేసి ప్రశంస పత్రాలు, బహుమతులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉప్పల నేహ కూడా..
మానుకోటకు చెందిన ఉప్పల రంగ, శ్రావణి దంపతుల కూతురు నేహ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటుంది. నేహ ప్రస్తుతం 3వ తరగతి చదువుతుంది. ఆయా నాట్యాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ పురస్కారాలు అందుకుంటోంది.
కూచిపూడిలో రాణిస్తున్న మానుకోట నృత్యకారిణులు
జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు ప్రదర్శనలు
ఎన్నో అవార్డులు, ప్రశంసలు


