మిర్చి వ్యాపారి కుచ్చుటోపీ | - | Sakshi
Sakshi News home page

మిర్చి వ్యాపారి కుచ్చుటోపీ

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఓ మిర్చి వ్యాపారి చేతులెత్తేశాడు. అడ్తిదారుల నుంచి మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీవిద్య చిల్లీస్‌ ట్రేడర్స్‌ అధినేత అమడగాని అయిలయ్య అలియాస్‌ అరుణ్‌ 62 మంది అడ్తిదారుల నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేశాడు. వారికి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు తెలుస్తోంది. దీంతో అడ్తిదారులు రైతులకు డబ్బులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయాన్ని సంప్రదించారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. సదరు వ్యాపారి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోందని రవీందర్‌రెడ్డి తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. బాధితుడు, మోక్ష ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని పోతు వినయ్‌కుమార్‌ ఆదివారం ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రూ.33.81 లక్షల విలువైన మిర్చి కొనుగోలు చేసి తనకు డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈమేరకు మిర్చి వ్యాపారి అమడగాని అయిలయ్య అలియాస్‌ అరుణ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు శోభ, నాగరాజు, మానస, సందీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజి సురేశ్‌ తెలిపారు.

మార్కెట్‌లో వరుస ఘటనలు..

మూడేళ్ల క్రితం ఓ వ్యాపారి రూ.6 కోట్లతో పరారయ్యాడు. నెల రోజుల క్రితం వరంగల్‌ మార్కెట్‌లో గాయత్రి చిల్లీస్‌ ట్రేడర్స్‌ పేరుతో 49 మంది అడ్తిదారుల నుంచి రూ.2 కోట్ల విలువైన మిర్చికొనుగోలు చేసిన వ్యాపారి బోర్డు తిప్పేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరోవ్యాపారి రూ.2.60 కోట్లతో పరారయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement