పెద్దవంగర: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చింది. కల్లం నుంచి ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి చేర్చారు. అమ్మడానికి ఆ ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి ఓ వృద్ధురాలిని బలితీసుకుంది. గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన ఆదివారం మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టీక్యాతండా జీపీ పరిధి శంకర్ తండాకు చెందిన జాటోత్ భద్రమ్మ (60) రామోజీ దంపతులు వ్యవసాయ కూలీలు. తమకున్న కొద్దిపాటి భూమిలో పడించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వడ్డేకొత్తపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌కు తరలించారు. అలాగే తన బావ కుమారుడు జాటోత్ వెంకన్న కూడా అదే కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వ ఉంచాడు. తూర్పార పట్టేందుకు వెంకన్న అతడి భార్య విజయతోపాటు భద్రమ్మ బైక్‌పై శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఐకేపీ సెంటర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో కొరిపల్లి క్రాస్ రోడ్డు వరకు చేరుకుంటున్న క్రమంలో తిర్మలగిరి వైపునకు వెళ్తున్న ఓ గుర్తుతెలియని కారు ఢీకొంది. ఈ ఘటనలో భద్రమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వెంకన్న, విజయ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108లో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తుతెలియని కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం
దంపతులకు తీవ్రగాయాలు


