దామెర: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. శాయంపేటకు చెందిన పాముకుంట్ల సుధాకర్ (47) స్కూటీపై శనివారం సాయంత్రం హనుమకొండ నుంచి శాయంపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో దామెర మండలం ఊరుగొండ నాగమయ్య గుడి ఆర్చ్ వద్ద ఓ బైక్ వెనుక నుంచి స్కూటీని ఢీకొంది. దీంతో సుధాకర్‌కు తీవ్రగాయాలుకాగా 108లో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య శాంతకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వడదెబ్బతో వృద్ధురాలు..
మంగపేట : వడదెబ్బతో ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన సుతారి లక్ష్మి(60) ఆదివారం మృతి చెందింది. కొంతకాలం క్రితం భర్త, కుమారుడు మృతి చెందడంతో లక్ష్మి వ్యవసాయ కూలీకి వెళ్తూ ఒంటరి జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే శనివారం కూడా కూలీకి వెళ్లి ఇంటికి చేరుకుంది. ఆదివారం ఉదయమైనా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. ఎండలో కూలీకి వెళ్లడంతో వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.


