డబ్బులిస్తేనే వేసవి శిబిరం! | - | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తేనే వేసవి శిబిరం!

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

సాక్షి, మహబూబాబాద్‌: వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాగా.. అర్బన్‌ ప్రాంతంలోని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేవని స్పోర్ట్స్‌ అథారిటీ చెబుతుంది. పిల్లల వద్ద డబ్బులు(ఫీజు) వసూలు చేసి.. ఆ డబ్బుతోనే కోచ్‌లను నియమించుకోవాలని చెప్పడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తమ పిల్లలకు వేసవిలో ఆటల్లో శిక్షణ ఇప్పిద్దామనుకున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది.

రూరల్‌ ప్రాంతాల్లో పది శిబిరాలు

జిల్లాలోని రూరల్‌ ప్రాంతాల్లో పది వేసవి క్రీడా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా వాలీబాల్‌, కరాటే, తైక్వాండో, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాస్కెట్‌ బాల్‌, నెట్‌బాల్‌, తదితర క్రీడల్లో మే 5 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులకు తెలిపారు. ఇందుకోసం ఇనుగుర్తి, జయపురం, గార్ల, నేరడ, తానంచర్ల, కాట్రపల్లి, ఉప్పలపాడు, అమ్మపాలెం, కల్వల గ్రామాలు వేదికకానున్నాయి.

డబ్బులిస్తేనే అర్బన్‌లో..

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచిత క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన జిల్లా యువజన క్రీడల శాఖ.. అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం డబ్బులు చెల్లించిన వారికే శిబిరాలు ఉంటాయని ప్రకటించింది. ప్రధానంగా మహబూబాబాద్‌, కేసముద్రం, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రతీ సంవత్సరం వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం మొత్తం 34 క్రీడలకు ఏ క్రీడకు ఎన్ని డబ్బులు చెల్లించాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాస్కెట్‌ బాల్‌ రూ.300, బాడ్మెంటెన్‌ రూ.500, చెస్‌ రూ.500, జమ్నాస్టిక్స్‌ రూ.200, లాన్‌టెన్నిస్‌ రూ.500, స్విమ్మింగ్‌ రూ.600, ఇలా ఒక్కొ క్రీడకు ధర నిర్ణయించారు. డబ్బులు ఇచ్చి శిక్షణ ఇప్పించే స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల శిక్షణకు పంపించడంలేదు. అధికారులు స్పందించి రూరల్‌ ప్రాంతాల మాదిరిగానే అర్బన్‌లో కూడా పేద పిల్లలకు ఉచిత శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అర్బన్‌ పరిధిలో క్యాంపులకు కొత్త నిబంధన

ఉత్తర్వులు జారీ చేసిన

క్రీడలు యువజన విభాగం

పిల్లల డబ్బులతోనే కోచ్‌ల వేతనాలు

ముందుకు రాని కోచ్‌లు

ఆటలకు దూరంగా

అర్బన్‌ ఏరియా పిల్లలు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్‌ ప్రాంతంలో క్రీడా శిబిరాలు పెట్టాలంటే విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేయాలి. అలా అయితేనే శిబిరం ఏర్పాటు, కోచ్‌లకు ప్రోత్పాహకాలు వస్తాయి. జిల్లా ప్రత్యేక పరిస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వారి ఆదేశాల మేరకు శిబిరాలు నిర్వహిస్తాం.

– ఓటేటి జ్యోతి,జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి

ఉచితంగా శిక్షణ ఇవ్వాలి

గిరిజనులు, పేదలకు ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్‌, క్రీడలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. వేసవిలో పిల్లలకు ఇచ్చే క్రీడా శిక్షణకు డబ్బులు వసూళ్లు చేయడం సరికాదు. ప్రభుత్వమే కోచ్‌ను నియమించాలి. వేసవిలో విద్యార్థులకు భోజన వసతులు కల్పించి క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలి.

– గుగులోత్‌ కిషన్‌ నాయక్‌,

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు

Advertisement
 
Advertisement
Advertisement