షాట్‌పుట్‌లో రాష్ట్రస్థాయికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

షాట్‌పుట్‌లో రాష్ట్రస్థాయికి ఎంపిక

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

పెద్దవంగర: జిల్లా అథ్లెటిక్స్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జంప్స్‌, త్రోస్‌, 400 మీటర్ల ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో పెద్దవంగర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి కిన్నెర బాలాజీ షాట్‌పుట్‌లో అండర్‌–16 విభాగంలో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర త్రోస్‌ (షాట్‌పుట్‌) పోటీలకు బాలాజీ అర్హత సాధించడంపై పాఠశాల పీడీ కంచెర్ల ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో హనుమకొండ జిల్లాలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనున్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లు

వేగవంతం చేయాలి

నెహ్రూసెంటర్‌: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, జనగణన, విద్యా వారోత్సవాలపై హైదరాబాద్‌ నుంచి శనివారం ఆయన సంబంధిత అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక, విద్యావారోత్సవాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్‌ తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ కె.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, విద్యా వారోత్సవాలు షెడ్యూల్‌ ప్రకారం విజయవంతం చేయాలని ఆదేశించారు. జనగణనపై సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు గూగూల్‌ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మధుసూదనరాజు, వ్యవసాయ అధికారి సరిత, విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, ఇంటర్మీడియట్‌ అధికారి మదర్‌, ఈఈ అరుణ్‌కుమార్‌, ఎంవీఐ సాయిచరణ్‌, మార్కెటింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు, సీపీఓ శ్రీనివాసరావు, డీఎస్‌ఓ రమేష్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏటీడీఓ ఉపేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో శనివారం సమ్మర్‌ క్యాంప్‌ ముగింపు కార్యక్రమానికి ఉపేందర్‌ హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించుకునేందుకు సమ్మర్‌ క్యాంప్‌ దోహదపడుతుందన్నారు. ఈ సమ్మర్‌ క్యాంప్‌లో బాలికలకు కుట్లు అల్లికలు, ఆటలు, యోగా, డ్రాయింగ్‌లో సంబంధిత ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డి.రాములు, జీసీడీఓ విజయ, పాఠశాల హెచ్‌ఎం పొడుగు నర్సయ్య, హెచ్‌డబ్ల్యూఓ పద్మ, పీడీ అనిల్‌, శిక్షకులు రవీందర్‌, రవి, శారద పాల్గొన్నారు.

భారీ వర్షం..

తడిసిన ధాన్యం

గూడూరు: మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మక్కలు, వరి ధాన్యం విక్రయించడానికి పీఏసీఎస్‌, ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 9 గంటలకు ఈదురు గాలులతో భారీ వర్షం మొదలైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వరి ధాన్యం దడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి పాడైన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement