కురవి: మండలంలోని ఎల్కచెట్టు తండా జీపీ పరిధిలోని మేఘ్యా తండాకు చెందిన రైతు బానోత్ మంగ్యా(70) అప్పులబాధతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగ్యాకు సుమారు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల నుంచి పంటలసాగు, ఇంటి కోసం, గతంలో భార్యకు ప్రమాదం జరగడంతో చికిత్స కోసం అప్పు చేశాడు. చేసిన అప్పులు పంటమీద తీర్చే పరిస్థితి కనిపించడంలేదు. భూమి అమ్మినా తీరే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మంగ్యా గురువారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందినట్లు మంగ్యా కుమారుడు హతిరాం శుక్రవా రం తెలిపారు. మంగ్యాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై కురవి ఎస్సై సతీష్‌ను వివరణ కోరగా అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు హతిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


