మున్సిపాలిటీల్లో అరకొరగా తాగునీటి సరఫరా
కాలనీల్లో నీటికి కటకట
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. భగీరథ పైపులైన్ లేని సుమారు 12 కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రెండు రోజులకోసారి అందిస్తున్నారు. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉద్యోగ, విద్యా, వ్యాపార పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి లక్ష జనాభా దాటుతుంది. 15,364 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులకు ప్రతీరోజు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మానుకోటలో సుమారు 12కాలనీలకు భగీరథ పైపు లైన్ నిర్మించకపోవడంతో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన 61 బావులు ఉండగా వాటిలో 28 బావులు వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా పంపిణీ చేసేందుకు ఈదులపూసపల్లి చెరువు నీటిని వినియోగించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
యాక్షన్ ప్లాన్‌తో
ముందుకెళ్తున్నాం..
మిషన్ భగీరథ నీరు సరిపోను వస్తున్నాయి. సమస్య వచ్చినా ఎదుర్కొనేవిధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. పలు కాలనీల్లో సమస్య ఉంది. ట్యాంకర్లద్వారా సరఫరా చేస్తున్నారు. బోర్లు అన్ని మరమ్మతు చేయించాం. వేసవిలో నీటి సమస్య లేకుండా చూస్తాం.
– రాజేశ్వర్,
మున్సిపల్ కమిషనర్, మానుకోట
దశాబ్దాలుగా నీటి సమస్య
కాలనీకి పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం చేయలేదు. దాంతో కాలనీలో కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య తీరడంలేదు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సమస్య పరిష్కరించాలి.
– వడ్లకొండ పద్మ,
ధర్మన్న కాలనీ
నీటి సమస్య ఎక్కువగా ఉంది..
కాలనీల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే నీరు సరిపోవడం లేదు. సమస్య ఉన్న కాలనీలకు రోజుకు రెండు సార్లు ట్యాంకర్లు పంపించాలి. శాశ్వతంగా నీటి సమస్య లేకుండా పరిష్కరించాలి.
– జగంటి మమత, మానుకోట


