● డీసీఓ భారతి హోళీ కేరి
మహబూబాబాద్: సెన్సెస్ –2027 నిర్వాహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ (డీసీఓ) భారతి హోళీకేరి అన్నారు. సెన్సెస్‌పై సంబంధిత అధికారులతో శుక్రవారం హైదరాబాద్ నుంచి భారతి హోళీ కేరి వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి హోళీ కేరి మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తలసేమియాపై
అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: తలసేమియా రక్త సంబంధిత వ్యాధి అని ముందస్తు పరీక్షలు, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జిల్లాలో 4,050 మంది గర్భిణులకు తలసేమియా పరీక్షలు నిర్వహించగా 114 మందికి తలసేమియా నిర్ధారణ జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రవణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, విరాజిత, అనిత, డెమో ప్రసాద్, ఆరోగ్య కేంద్ర సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు
పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పురుషొత్తం అన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్‌విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఐఈఓ సీహెచ్.మదార్‌గౌడ్, అధికారులు శ్రీరాములు, ఎస్సై పాల్గొన్నారు.
రేపు జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం
కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు.


