‘అమృత్‌’ విషమవుతోంది! | - | Sakshi
Sakshi News home page

‘అమృత్‌’ విషమవుతోంది!

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

పగిలిన పైపులతో కలుషితమవుతున్న తాగునీరు

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలో రెండున్నర సంవత్సరాల క్రితం చేపట్టిన అమృత్‌ జల్‌ పథకం పనులతో ప్రజలకు సక్రమంగా తాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపల్‌ పరిధిలో అమృత్‌ పనుల కోసం తవ్వకాలు చేపట్టడంతో పలు వార్డుల్లో తాగునీటిని సరఫరా చేస్తున్న పైపులు పగిలి రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచింది. కొన్ని వార్డుల్లో రెండు నుంచి మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండగా కొన్ని వార్డుల్లో వారం రోజులకోసారి సరఫరా అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులు పగలడం, పైపుల్లో మట్టి కూరుకుపోయి సరఫరా నిలవడం, భగీరథ సరఫరా నిలిచిపోవడం, ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు నిత్యం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. 1వ వార్డులోని అంబేడ్కర్‌నగర్‌, రెండవ వార్డులోని న్యూ నెహ్రూ స్ట్రీట్‌, 12వ వార్డులోని యాదవనగర్‌, 9వ వార్డు పరిధిలోని పాతడోర్నకల్‌, 13వ వార్డులోని బొక్కలకొట్టు బజార్‌ తదితర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భగీరథ నీటి సరఫరాతో సంబంధం లేకుండా పెద్ద చెరువులోని నాలుగు బోరుబావులు, కిరీటాపురం బావితోపాటు రెండు అద్దె బావుల ద్వారా ద్వారా రాజుతండా, ఎస్సీబీసీ కాలనీ, చర్చి కాంపౌండ్‌, బంకట్‌సింగ్‌తండా, లచ్చాతండా, రాజుతండా, పంపుబావితండా, సిగ్నల్‌తండా, సోమ్లాతండా తదితర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

మూడు నెలలుగా ఇబ్బందులు..

అంబేడ్కర్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలవడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. చేతిపంపుల ద్వారా నీటిని తెచ్చుకునేందుకు ఇబ్బంది ఉంటుంది. నీటి ఇబ్బందులపై మున్సిపల్‌ సిబ్బంది, పాలకవర్గం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి.

– మందా రవి, అంబేడ్కర్‌ నగర్‌, డోర్నకల్‌

Advertisement
 
Advertisement
Advertisement