మహబూబాబాద్ రూరల్ : ఈత నేర్చుకునేందుకు వెళ్లి మున్నేరువాగులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది మహబూబాబాద్ రూరల్, టౌన్ ఇన్‌చార్జ్ సీఐ ఎన్.అంజలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బజార్ ప్రాంతంలో నివాసం ఉండే టేకురాల సాగర్, అనంత దంపతులకు ఇద్దరు కుమారులు అభిలాష్ (21), అంజి ఉన్నారు. తల్లి ఇళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఈత నేర్చుకునేందుకు మిత్రుడు రంజిత్‌తో కలిసి మున్నేరువాగు వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న చెక్ డ్యాంపై నుంచి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. టౌన్ ఎస్సైలు రాంచరణ్, షాకీర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అనంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రాంచరణ్ తెలిపారు.


