హన్మకొండ అర్బన్ : యువత అవకాశాలను వినియోగించుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను శుక్రవారం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు. జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన వారందరికీ 72 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వరంగల్ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. రక్తదానం, అవయవదానం వంటి సామాజిక అంశాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలను పెంపొందించుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో సుమారు 4 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కేవలం డిగ్రీలు సరిపోవని, కమ్యూనికేషన్, సాంకేతిక నైపుణ్యాలు అవసరమని యువతకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. 72 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా 2,600 మంది నమోదు చేసుకోగా, మొత్తం 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, అధికారులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
మెగా జాబ్ మేళాలో
4 వేల మందికి ఉద్యోగావకాశాలు


