ఆదాయ వనరుల పెంపుతోనే బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ఆదాయ వనరుల పెంపుతోనే బలోపేతం

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

హన్మకొండ అర్బన్‌ : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సెంట్రల్‌ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో ఎమ్మెల్యే నాగరాజు, సభ్య కార్యదర్శి పి.కాత్యాయనిదేవి, సభ్యుడు ఎస్‌. సుధీర్‌ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు స్వీయ ఆదాయాన్ని పెంచుకుని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్య, పచ్చదనం, పన్ను వసూళ్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

భద్రకాళిని దర్శించుకున్న నోడల్‌ అధికారి

హన్మకొండ కల్చరల్‌ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారి, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.కాత్యాయనిదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అధికారులు ఆలయాన్ని సందర్శించిన కాత్యాయనిదేవిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం అర్చకులు కాత్యాయనిదేవికి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

Advertisement
 
Advertisement
Advertisement