మాకొద్దు! | - | Sakshi
Sakshi News home page

మాకొద్దు!

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

యాసంగి

ధాన్యం

ధాన్యం దిగుమతికి మిల్లర్ల వెనకడుగు

సాక్షి, మహబూబాబాద్‌ : వానాకాలం సీజన్‌లో పోటీ పడి ధాన్యం తీసుకున్న మిల్లర్లు యాసంగి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మొండికేస్తున్నారు. యాసంగిలో మొత్తం 2.60లక్షల మెట్రిట్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇందులో 1.70లక్షల మేరకు దొడ్డు రకాలే వచ్చే అవకావం ఉందని మిల్లర్లు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 26,569 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా.. ఇందులో 17వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే మిల్లర్లు తిగుమతి చేసుకున్నారు. మిగిలిన 9వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కాంటాలు పెట్టి కల్లాల్లోనే ఉండిపోయింది. జిల్లాలో 55 రా రైస్‌ మిల్లులు, ఐదు పారా బాయిల్డ్‌ మిల్లులు ఉండగా.. ఇప్పటి వరకు 31 మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇందులో మూడు పారాబాయిల్డ్‌, ఒక రారైస్‌ మిల్లు మినహా మిగిలిన మిల్లులు నామమాత్రంగా ధాన్యం దించుకున్నారు. మరో 28 రైస్‌ మిల్లు యజమానులు ఒక్క గింజ ధాన్యం కూడా దించుకోలేదు.

మిల్లర్లకు అధికారుల హెచ్చరిక

కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం వెనువెంటనే దిగుమతి చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న రైస్‌ మిల్లర్లతో జిల్లా అధికారులు సమీక్షలు నిర్వహించారు. జీఓ నంబర్‌ 25 ప్రకారం మిల్లు సామర్థ్యంలో 50శాతం ధాన్యం దించుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తప్పవని, మరోసారి ధాన్యం ఇవ్వకుండా బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించినట్లు తెలిసింది.

కాంటాలు పెట్టినా.. కల్లాల్లోనే ధాన్యం

దిగుమతి కాకపోవడంతో వారాల తరబడి లారీలు అక్కడే..

కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్న రైతులు

దిగుమతి వేగవంతంచేస్తాం..

జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెబుతున్నాం. ధాన్యం దిగుమతి చేసుకోకుండా మొండికేసిన రైస్‌ మిల్లు యజమానులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకోవాలని చెప్పారు. దీంతో కొనుగోళ్లు, దిగుమతి ప్రక్రియ వేగవంతం అవుతుంది.

– నర్సింహారావు, డీఎం, సివిల్‌ సప్లయీస్‌

Advertisement
 
Advertisement
Advertisement