తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి..? | - | Sakshi
Sakshi News home page

తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి..?

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

కొత్తగూడ: వైద్యారోగ్యశాఖ అధికారుల వ్యవహార శైలి ‘పుండు ఒక చోట ఉంటే మందు మరో చోట’ రాసినట్లు ఉందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్‌సీల్లో పని చేసే డాక్టర్లు సర్వీస్‌ కోటాలో ఉన్నత చదువులకు వెళ్లి సుమారు రెండు నెలలు కావస్తోంది. వారి స్థానంలో నూతన డాక్టర్లను నియమించాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ తతంగంపై ‘పీహెచ్‌సీలకు ఇన్‌చార్జిలే దిక్కు’ శీర్షికన ఇటీవల సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా కలెక్టర్‌ గంగారం పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేయగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ గంగారం పీహెచ్‌సీ తనిఖీ చేసి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

మూడు పీహెచ్‌సీలకు ఒక్కరే డీడీఓ

కొత్తగూడ పీహెచ్‌సీలో పని చేసే ఇద్దరు డాక్టర్లు బదిలీపై వెళ్లారు. డోర్నకల్‌ పీహెచ్‌సీలో ముగ్గురు ఉన్నారని వరుణ్‌తేజ్‌కు కొత్తగూడ పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌ వేశారు. ఈయన సరిగా విధులకు హాజరు కాకపోవడం, గంగారం పీహెచ్‌సీ శ్రీకాంత్‌ అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో కోమట్లగూడెం పీహెచ్‌సీ వైద్యుడు సాయినాథ్‌కు మూడు పీహెచ్‌సీల బాధ్యతలు అప్పగించారు. తన సొంత పీహెచ్‌సీలో వైద్యసేవలు అందించలేక, డిప్యుటేషన్‌ డాక్టర్లతో పని చేయించలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్యం అందడం కష్టంగా మారింది.

వైద్యుల నియామకానికి నివేదిక పంపిస్తా..

ప్రభుత్వం వైద్యులను నియమించే వరకు తాత్కాలిక పద్ధతిన కొత్త డాక్టర్లను నియమించేందుకు కలెక్టర్‌ అనుమతి కోసం నివేదిక పంపిస్తా. అనుమతులు రాగానే ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్‌సీలకు డాక్టర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటా. అప్పటి వరకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటా. – రవి రాథోడ్‌, డీఎంహెచ్‌ఓ

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

గంగారం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ అన్నారు. గంగారం పీహెచ్‌సీలో గురువారం ఆయన తనఖీచేసి నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో సమయపాలన పాటించాలని, రోగులకు మర్యాదపూర్వక సేవలు, మందుల లభ్యత పరిశుభ్రత వంటి అంశాల్లో అలసత్వం వహించొద్దని తెలిపారు.

వైద్యులను నియమించకుండా షోకాజ్‌ నోటీసులు

Advertisement
 
Advertisement
Advertisement