డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

తొర్రూరు: డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని దుబ్బతండా సమీపంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్లను గురువారం ఆమె పరిశీలించారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్‌, రహదారులు, డ్రెయినేజీలు తదితర సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పైరవీకారులు, అనర్హులకు లబ్ధిదారుల జాబితాలో చోటు లేదన్నారు. అర్హులకే ఇల్లు దక్కాలన్న ప్రభుత్వ ఆదేశానుసారం పకడ్బందీగా ఎంపిక విధానం చేపడుతామన్నారు. అనంతరం మండలంలోని వెలికట్ట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. కావాల్సిన గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌజింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పురుషోత్తం, సివిల్‌ సప్లయీస్‌ అధికారి రమేష్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకం

మహబూబాబాద్‌: గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో నిత్యం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. తాగు నీరు, సానిటేషన్‌, జాతీయ ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు తదితర విషయాలపై కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లను శుభ్రం చేయించి మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, అన్ని మండలాల ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement