పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వతేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ ఆదేశించారు. కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి పరిశీలించారు. ముందుగా సరస్వతి ఘాట్‌లో పార్కింగ్‌ టైల్స్‌ పనులు, సరస్వతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసే పగోడాలు, చలువ పందిళ్ల ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌ స్థలాలు, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు, మద్దులపల్లి, పూసుకుపల్లి, బలిజాపూర్‌, గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. మ్యూజియం పనులను పరిశీలించి, ఈ నెల 18వ తేదీ నాటికి విగ్రహాల ప్రతిష్ఠాపన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఈనెల 21 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

ముహూర్తం ఖరారు..

ఈ నెల 21వ తేదీ ఉదయం 5:43 గంటలకు తమిళనాడుకు చెందిన కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించనున్నారు. అదేరోజు రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కూడా పుణ్యస్నానం ఆచరించనున్నారని తెలిపారు. గతంలో ఆది పుష్కరాల్లో స్నానం చేయని భక్తులు అంత్య పుష్కరాలకు పెద్దఎత్తున తరలొస్తారని ఆమె పేర్కొన్నారు. ఆలయంలో దర్శనం అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు.కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, ఈఓ మహేశ్‌, సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

21న ఉదయం 5:33 గంటలకు

ముహూర్తం ఖరారు

కంచి పీఠాధిపతితో పుష్కరాలు ప్రారంభం

దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

శైలజారామయ్యర్‌

Advertisement
 
Advertisement
Advertisement