ట్రాక్టర్‌ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

చిట్యాల: ట్రాక్టర్‌ ఢీకొని ఓ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం .. మండలంలోని జడల్‌పేటకు చెందిన జినుకల శ్రీనివాస్‌ (55) అదే గ్రామానికి చెందిన మిన్నాపురం రమేశ్‌ పల్లిచేను పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం పక్క చేను వద్ద ఉన్న నైన్‌పాకకు చెందిన రైతు బికునూరి మొగిలితో మాట్లాడుతున్నాడు. అక్కడే ఓ బాలుడు ట్రాక్టర్‌తో పత్తి చెట్లు తొలగిస్తున్న క్రమంలో ఇద్దరిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మొగిలికి స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చిట్యాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇందిరా, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ట్రాక్టర్‌ అదుపు తప్పడంతో డ్రైవర్‌..

నర్సంపేట రూరల్‌ : ట్రాక్టర్‌ అదుపు తప్పి కాల్వ లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం నర్సంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన వాంకుడోతు వెంకటేశ్వర్లు (35) మక్కల లోడ్‌ తీసుకుని నర్సంపేట మండలం భానోజీపేట వద్ద అన్‌లోడ్‌ చేసి తిరిగి రాగంపేటకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి పట్టణంలోని నర్సంపేట –మహబూబాబాద్‌ 365 జాతీయ రహదారిపై ఉన్న పస్పూనూర్‌ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వెంకటేశ్వర్లు ఎగిరి పడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై గూడ అరుణ్‌ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నర్సక్కపల్లి శివారులో

కారు అదుపు తప్పి యువకుడు..

నడికూడ : కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి శివారులో చోటుచేసుకుంది. పరకాల ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. దామెర మండలం పసరగొండకు చెందిన రాగుల రాజేశ్‌(23) హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏలో సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్నాడు. కమలాపూర్‌లో బంధువుల పెళ్లి ఉండగా మంగళవారం స్వగ్రామం వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన సంకేళ్ల ప్రశాంత్‌ కారులో బుధవారం తన స్నేహితులు సంకేళ్ల చరణ్‌, చెక్క లక్ష్మణ్‌, మంద గణేశ్‌, తోట కార్తీక్‌తో కలిసి కమలాపూర్‌లో బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగొస్తున్న క్రమంలో నర్సక్కపల్లి శివారులో పరకాల–హుజూరాబాద్‌ ప్రధాన రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఎడమ వైపు ఉన్న కల్వర్టు పైనుంచి ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో గణేశ్‌ తన కుటుంబీకులు, 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వెంటనే ఘటానాస్థలికి చేరుకుని ఎంజీఎం తరలించారు. ఇందులో రాగుల రాజేశ్‌ మృతి చెందగా మిగతా వారు చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరొకరికి స్వల్ప గాయాలు

నైన్‌పాక శివారులో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement