● 9 మందికి గాయాలు
● కొండపర్తి సమీపంలో ఘటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు గురువారం తెల్లవారుజామున కొండపర్తి సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. కాగా, బస్సు ముందు భాగంలో అద్దాలు పగిలిపోయాయి. ఈఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తాడ్వాయి ఎస్సై జగదీశ్ తెలిపారు.
సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
తొర్రూరు రూరల్: కొత్త సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమటం సాయికుమార్(21) మద్యానికి బానిసై ఇటీవల తన సెల్‌ఫోన్‌ను కిందపడేసి పగులగొట్టుకున్నాడు. తనకు కొత్త సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 6న బుధవారం సాయంత్రం కూడా మద్యం సేవించి వచ్చి మరోసారి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తల్లి సాయమ్మ అన్నం పెడుదామని గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తన పెద్ద కుమారుడి సాయంతో కిందికి దించి తొర్రూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


