అన్నింటికీ యంత్రాలే.. | - | Sakshi
Sakshi News home page

అన్నింటికీ యంత్రాలే..

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

అన్నింటికీ యంత్రాలే.. ● వరంగల్‌ జిల్లాలో తగ్గుతున్న వ్యవసాయ కూలీలు ● ఉపాధి హామీ పథకమూ కారణమే.. ● ఖర్చు తగ్గుతుండడంతో రైతుల ఆసక్తి

● వరంగల్‌ జిల్లాలో తగ్గుతున్న వ్యవసాయ కూలీలు ● ఉపాధి హామీ పథకమూ కారణమే.. ● ఖర్చు తగ్గుతుండడంతో రైతుల ఆసక్తి

ఖిలా వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలతో పాటు అన్నింటికీ రైతులు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. కూలీలతో పోలిస్తే యంత్రాలకే ఖర్చు తగ్గుతుండడంతో రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు రోజురోజుకూ వ్యవసాయం చేసే వారితో పాటు రైతు కూలీలు కూడా తగ్గిపోతున్నారు. కౌలు వ్యవసాయం పెరగడంతో కూలీలే కౌలు రైతులుగా మారుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో అన్ని పంటలు మిర్చి, పత్తి, ఇతర ఉద్యాన పంటలు కలిపి 2.88లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో ప్రధానమైన వరి 1.05 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. క్రమంగా అన్ని పంటల సాగుకు యంత్రాలు వచ్చి చేరుతున్నాయి. పెరిగిన కూలీల ఖర్చులకు తోడు.. ఉపాధి హామీ పనులతో జిల్లాలో కూలీలు దొరకటం కూడా కష్టమైపోయింది. కూలీల కొరతతో రైతులు యంత్రాల వైపునకు ఆలోచిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి యంత్రాలు

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 6.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వరి నాట్ల దగ్గర నుంచి వరికోత, నూర్పిడి వరకు కూలీలతో చేయిస్తే ఎకరాకు రూ.17 వేల వరకు ఖర్చవుతుంది. అదే యంత్రాలతో చేస్తే రూ.12వేలలోపే పూర్తవుతుంది. పైగా పంట చేలల్లో కుప్పులుగా ఉంచి వాతావరణ పరిస్థితులపై బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పని కూడా లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 860కి పైగా వరికోత యంత్రాలున్నాయి. జిల్లాలో అవసరాలకు తగినన్ని లేకపోవటంతో రైతులు బయటి నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా యంత్రాలను వాడుకుంటున్నారు.

వేటిని వాడుతున్నారంటే..

వరినాట్లు, కోత యంత్రాలు, మొక్కజొన్న, జొన్న కోత యంత్రాలు, భూమిని సిద్ధం చేసే యంత్రాలను జిల్లా రైతాంగం ప్రస్తుతం వాడుతోంది. వ్యవసాయానికి అత్యంత అనుబంధం ఉన్న ట్రాక్టర్‌, తైవాన్‌ స్ప్రేయర్‌, ఇతర పనిముట్ల వంటి వాటికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండడంతో యాంత్రీకరణ కూడా అతి తక్కువ కాలంలోనే జరిగిపోతోంది. వరి కోత, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలయితే స్థానిక రైతులు కొనుగోలు చేసినవి చాలని పరిస్థితుల్లో.. ఇతర రాష్ట్రాల నుంచి అద్దెకు తెచ్చి కోతలు పూర్తి చేయించే వారూ పెరిగిపోయారు. పురుగు మందుల పిచికారీ వంటి వాటికి సంబంధించి తైవాన్‌ స్ప్రేయర్‌లను వాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement