నర్సంపేట:
మంచి లక్ష్యంతో మన పూర్వీకులు చెప్పే మాటలు, సినిమాల్లో మనస్సుకు హత్తుకుపోయే మాటలు జీవితాంతం గుర్తుంటాయి. ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అంటూ అంకురం తెలుగు సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట లాగానే నర్సంపేట పట్టణంలో పర్యావరణ హితమే లక్ష్యంగా ఏఎస్‌ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ముందుకు సాగుతోంది. 8 సంవత్సరాల క్రితం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రారంభించిన ప్రయత్నం ప్రస్తుతం వరంగల్, ములుగు జిల్లా వ్యాప్తంగా చైతన్యంలా ముందుకు సాగుతోంది. ప్లాస్టిక్ వద్దు.. పేపర్ ముద్దు అనే నినాదంతో చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సత్ఫలితాలనిస్తోంది. పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రజలు మూకుమ్మడిగా కదులుతున్నారు. ఏఎస్‌ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎర్రబోయిన రాజశేఖర్, మరికొంత మంది ఇందులో పాల్గొంటున్నారు.
శుభకార్యాల్లో స్టేజీపైనే అవగాహన..
నర్సంపేటలో ప్రారంభించిన ప్లాస్టిక్ రహిత ప్రచారంతో శుభకార్యాల్లో ప్లాస్టిక్‌కు బదులు స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగిస్తున్నారు. శుభకార్యాల్లో స్టేజీపై ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను ఏఎస్‌ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ బాధ్యులు వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. జనవరిలో జరిగిన మేడారం జాతరలో కూడా ప్లాస్టిక్ వాడొద్దంటూ చేసిన ప్రచారం ఆకట్టుకుంది. అతి పలుచని కవర్లలో వేడి ఆహారం, టీలు, సాంబర్లు తీసుకుంటే వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు. విస్తారాకు ప్లేట్లు, మాస్క్‌లు, చేతి సంచులు వాడాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను తెలుసుకుంటున్నారు.
అందరూ సహకరించాలి..
ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి. సింగిల్ యూజ్జ్ ప్లాస్టిక్‌తో ఆరోగ్య సమస్యలు వస్తాయి. 8 ఏళ్లుగా నాతో పాటు పలువురి సహకారంతో ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తున్నాం. అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిస్తాం. ఇందుకోసం ప్రజలు చేయూతనందించాలి.
– ఎర్రబోయిన రాజశేఖర్, ఏఎస్‌ఆర్
సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న
ఏఎస్‌ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ


