ఆపన్నహస్తం అందించరూ! | - | Sakshi
Sakshi News home page

ఆపన్నహస్తం అందించరూ!

May 8 2026 1:01 PM | Updated on May 8 2026 1:01 PM

ఆపన్నహస్తం అందించరూ! ● క్యాన్సర్‌తో పోరాడుతున్న వివాహిత ● ఆర్ధికంగా చితికిపోయిన దంపతులు ● దాతల సహాయం కోసం భర్త వేడుకోలు

కాశిబుగ్గ/ఖిలావరంగల్‌: ఆర్థికంగా చితికిన కుటుంబం. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ సాధారణ జీవనం గడుపుతున్న దంపతులను కాన్సర్‌ మహమ్మారి పీడిస్తోంది. భార్యకు క్యాన్సర్‌ ఉందని ఆలస్యంగా తెలుసుకున్న భర్త ఆందోళనకు గురయ్యాడు. దీంతో భార్యను బతికించుకోవడానికి అనేక పాట్లు పడుతున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్‌ ఉర్సు కరీమాబాద్‌కు చెందిన మధుసూదన్‌, మౌనిక దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఎప్పడో ఆవరించిన క్యాన్సర్‌ మహమ్మారిని వారు గత ఫిబ్రవరిలో వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. దీంతో ఆందోళనకు గురైన దంపతులు వరంగల్‌, హనుమకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రులను సంప్రదించారు. ఆయా ఆస్పత్రుల్లో మౌనికకు చికిత్స చేయించినా వ్యాధి తీవ్రత చేయి దాటిపోయింది. దీంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓమెగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే మూడో స్టేజీకి చేరుకున్న క్యాన్సర్‌ను నయం చేయాలంటే లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఇద్దరు పిల్లల పోషణ, భార్య ఆరోగ్య పరిస్థితి మధుసూదన్‌కు తలకు మించిన ఆర్థిక భారంగా మారింది. వారికి ఎలాంటి ఆర్థిక ఆధారం లేకపోవడంతో దాతల సాయం ఎదురు చూస్తున్నాడు. భార్యను బతికించుకుని, పిల్లాపాపలతో గడపడానికి దాతలు ముందుకురావాలని మధుసూదన్‌ వేడుకోంటున్నాడు. 9398711733 నంబర్‌కు ఫోన్‌ పే గాని గూగుల్‌ పే గాని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement