హన్మకొండ కల్చరల్: క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది అర్షియా తబస్సుం. చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ మెడిసిన్‌లో సీటు వచ్చే అవకాశం లభించినా వదులుకుని వ్యవసాయ రంగంపై మక్కువతో వరంగల్‌లోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో పట్టాపొందారు. విశ్వవిద్యాలయం పరిధిలో మొదటిర్యాంకు సాధించి ఇప్పటి వరకు ఆరు బంగారు పతకాలను అందుకున్న అర్షియా తబస్సుం యువతకు స్ఫూర్తిదాయకం.
వ్యవసాయశాఖలో కొలువు..
హనుమకొండకు చెందిన అర్షియా తబస్సుం తల్లి రెహనా బాను సీనియర్ అసిస్టెంట్‌గా పంచాయితీరాజ్‌శాఖ హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగి. తండ్రి అసద్ అలీఖాన్ వ్యాపారి, సోదరుడు అమేర్ అలీఖాన్ గ్రూప్–4 నుంచి జూనియర్ అసిస్టెంట్‌గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం వరంగల్ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో విధులు నిర్వహిస్తున్నారు. అర్షియా చిన్ననాటి నుంచి పండ్లు, కూరగాయలు, ధాన్యాలపై ఆసక్తిగా కుటుంబసభ్యులతో చర్చించేది. ఆ విధంగా పంటలు, రైతుల గురించి తెలుసుకున్న అర్షియా వ్యవసాయ విద్యను అభ్యసించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ విద్య పూర్తిచేసి 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే వ్యవసాయశాఖ క్రిమిసంహారక విభాగంలో వ్యవసాయాధికారిగా ఉద్యోగం సాధించారు.
ఆరు బంగారు పతకాలు ఆమె సొంతం
పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ బైపీసీలో 977 మార్కులు, 2018 ఎంసెట్‌లో 405వ ర్యాంకు సాధించారు. వరంగల్ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో చేరి విశ్వవిద్యాలయ పరిధిలో మొదటి ర్యాంకు ( 9.3 సీజీపీఏ) సాధించారు. మొత్తంగా ఆరు బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ప్లాంట్ పాథాలజీలో అత్యధిక గ్రేడ్ పొందినందుకు శ్రీరాజారామ్ వెంగల్ దాస్ స్మారక బంగారు పతకం, జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో అత్యధిక జీపీఏ పొందినందుకు పల్లి వాణి అండ్ చంద్రశేఖర్‌రావు గోల్డ్ మెడల్, రాజేంద్రనగర్ అగ్రి–హార్టీ బ్యాచ్‌లో బంగారు పతకం, రాజేంద్రగనర్ అగ్రికస్ బ్యాచ్ నుంచి వ్యవసాయశాస్త్రంలో గోల్ట్‌మెడల్, గత సంవత్సరం 2025 అగష్టు 2న హైదారాబాద్‌లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 55వ స్నాతకోత్సవంలో అప్పటి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నాలుగు బంగారు పతకాలు అందుకున్నారు. వరంగల్ అగ్రికల్చర్ కళాశాలలో అత్యధిక జీపీఏ సాధించినందుకు అవినాష్ వనం గోల్ట్ మెడల్, గ్రోమోర్ గోల్డ్ మెడల్‌లను 2026 ఫిబ్రవరిలో జరిగిన కళాశాల పదో వార్షికోత్సవంలో డీఏఏ అనురాధ, కళాశాల డీన్ రవీంద్రనాయక్ చేతుల మీదుగా అందుకున్నారు. బీఎస్సీ డిగ్రీ అనంతరం హైదారాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్(నిఫ్మ్)లో శిక్షణ పొందారు. టీజీపీఎస్‌సీ అగ్రికల్చర్ ఎగ్జామ్‌లో 21వ ర్యాంకు సాధించి 2024లో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండల వ్యవసాయ అధికారిగా చేరారు. ప్రస్తుతం వరంగల్‌లోని క్రిమిసంహారక ప్రయోగశాలలో ఏఓగా పనిచేస్తున్నారు. రసాయన క్రిమిసంహారకాల వినియోగంలో పర్యావరణానికి కలిగే నష్టాలు, మనుషులకు వచ్చే అనారోగ్యాల గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో తయారయ్యే క్రిమిసంహారకాల తయారీ, వినియోగం గురించి రైతన్నలను చైతన్యపరుస్తున్నారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంతృప్తిగానే ఉన్నా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు.. అర్షియా తబస్సుం.
తొలి ప్రయత్నంలోనే వ్యవసాయ శాఖలో ఉద్యోగం
ఆరు బంగారు పతకాలు ఆమె సొంతం


