స్టేషన్‌ఘన్‌పూర్: భారీ వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి ఛాగల్లులో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎఫ్‌ఆర్‌ఓ చంద్రకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు అందించిన సమాచారంతో ఫారెస్టు సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ ఒక మగ ఎలుగుబంటి మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. భారీ వాహనం ఢీకొనడంతో ఎలుగుబంటి పైదవడ, కింది దవడ, ముక్కు భాగానికి తీవ్రగాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించినట్లు చెప్పారు. అనంతరం పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి సమీపంలోని తాటికొండ రిజర్వ్ ఫారెస్టుకు తరలించి పూడ్చిపెట్టినట్లు ఎఫ్‌ఆర్‌ఓ వెల్లడించారు.


