భీమదేవరపల్లి : వ్యవసాయ పనుల్లో అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరిగడ్డి కట్టలు కట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్‌లో చేయి ఇరుక్కుపోవడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రచ్చ సంపత్ (50) గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద బుధవారం ట్రాక్టర్ సాయంతో వరి గడ్డి కట్టలు కట్టే మిషన్‌ను సరిచేసేందుకు ప్రయత్నించాడు. గడ్డి కట్టే మిషన్‌లో అతని చేయి చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో భుజం వరకు చేయి తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావమై సంపత్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య రమ, పిల్లలు ఉన్నారు. సంపత్ భార్య రచ్చ రమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.


