కేయూ క్యాంపస్: రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెనుమార్పులు, సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. తొలిమెట్టుగా సమగ్ర పంటల మార్పిడి తీసుకురావాలని నిర్ణయించిందన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాల మైదానంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా రెండోరోజు బుధవారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కమిషన్‌గా తాము కేరళ, మహారాష్ట్ర, మన రాష్ట్రంలోని పలు జిల్లాలు తిరిగి సమగ్రమైన పంటల మార్పిడి విధానాన్ని రూపొందించి ఆ నివేదికను ఈనెల 5న సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రికి ఇచ్చామని వెల్ల డించారు. అందులో తాము పరిశీలించిన అనేక అంశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు ఆకుకూరలు, పూలు పండించే రైతాంగానికి అనేక ఇబ్బందులున్నాయని, కోతుల బెడద వల్ల చాలోచోట్ల రైతులు భూములను బీడు పెట్టారన్నారు. దీనిపై కమిషన్ చాలామందిని సంప్రదించాక చిన్న, సన్నకారురైతులకు ఫెన్సింగ్ సబ్సిడి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టామని తెలిపారు. దీనివల్ల ఉద్యావన పంటల విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దళారుల దోపిడీ నుంచి బయటపడాలంటే రైతులు సంఘటితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయిల్ ఫెయిడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయపద్ధతులను రైతులకు పరిచయం చేయడానికి మెగా రైతుమేళా వేదికగా నిలిచిందన్నారు. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, ఇబ్బందులను అధిగమించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ మెగా రైతుమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, గురువారం ఈ మేళా ముగియనుంది.
వ్యవసాయ రంగంలో
సంస్కరణలు అవసరం
రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ
కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి


