బచ్చన్నపేట : ఈతకు వెళ్లిన ఓ దివ్యాంగ యువకుడు గల్లంతయ్యాడు. ఈఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర పద్మ, భిక్షపతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు కరుణాకర్ (30) దివ్యాంగుడు. ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి ఊరు పక్కన ఉన్న తుమ్మలబావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దూకి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో గమనించిన స్నేహితులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఎ. శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించినా మృతదేహం కనిపించలేదు. ఈ నేపథ్యంలో మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడిస్తూ సోమవారం మృతదేహం కోసం ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు.
వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు..
మండల కేంద్రంలోని రాజన్న బావిలో మండల కేంద్రానికి చెందిన ఎనుగుల కరుణాకర్ ఇదే తరహాలో ఈత కొట్టడానికి వెళ్లి శనివారం గల్లంతు కాగా మృత దేహం లభించలేదు. ఆదివారం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో కరుణాకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అది మరవక ముందే మూడు గంటల వ్యవధిలో రామచంద్రాపురంలో మరో ఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈత వచ్చిన వ్యక్తులే ఇలా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలు కోసిన తర్వాత మోటార్లు బంద్ చేయడంతో వ్యవసాయ బావుల్లో నీరు నిల్వ ఉంటుంది. ఆ నీరు చాలా రోజులు నిల్వ ఉండడంతో ఆకులు పడి మురుగడంతో ఏమైనా విషపదార్థాలు తయారవుతున్నాయా అని అర్థం కావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
బచ్చన్నపేట ఘటన మరువకముందే రామచంద్రాపురంలో మరోటి..


