నిటారు చెట్టు అంచును నిమిషాల్లో చేరుకుంటారు. కమ్మటి కల్లు కత్తులతో సావాసం చేస్తుంటారు. ముంతెడంత కల్లును దింపడానికి ముప్పుతిప్పలు పడుతుంటారు. అమృతాన్ని ముక్తాదుకు వేసుకుని ఆకాశమంతటి చెట్టును అడుగులతో కొలుస్తారు. ఈ క్రమంలో పారే కల్లు కోసం ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ గీతన్నల కుటుంబాలకు భరోసా లేకుండా పోతోంది. ఈనేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
కాజీపేట: కుటుంబ పోషణకు గీత వృత్తిని నమ్ముకున్న కార్మికులను నిత్యం ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కల్లు గీయడం కోసం నిత్యం రెండు, మూడుసార్లు తాటి చెట్టు ఎక్కి దిగే కార్మికులకు ప్రమాదాలు తప్పట్లేదు. కల్లు అమ్మి జీవనం సాగించే కార్మికులు దినదిన గండంగా బతుకులను వెళ్లదీస్తున్నారు. ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు.. మోగిళ్లలో విషపురుగులను తప్పించుకునే క్రమంలో కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లు ఎక్కే క్రమంలో గుండెపోటు, కళ్లు తిరగడం, పనిభారంతో సత్తువ కోల్పోయి కిందపడుతూ మృతి చెందుతున్నారు. మరి కొందరు క్షతగాత్రులవుతున్నారు.
కల్లుగీత కార్మిక సంఘం లెక్కల ప్రకారం..
రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం లెక్కల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 800 మంది గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి కులవృత్తికి దూరమయ్యారు. వీరిలో 570 మంది మృత్యువాత పడగా 230 మందికిపైగా పాక్షికంగా, శాశ్వత అంగవైకల్యాం పొందారు. మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం, గాయపడిన వ్యక్తికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. ప్రభుత్వ పరిహారం కోసం కార్మికుల కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 22 మంది గీత కార్మిక కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. వందకు పైగా గీతకార్మికులు గాయాలపాలై మంచాన పడ్డారు. దీనావస్థలో జీవనం సాగిస్తున్నారు.
కాటమయ్య కిట్లు ఉన్నప్పటికీ..
గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆ సామాజిక వర్గ ఆరాధ్యదైవం ‘కాటమరాజు’ పేరుతో పథకానికి శ్రీకారం చుట్టింది. పని భద్రత కల్పించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కిట్లను వెనుకబడిన తరగతుల (బీసీ) కార్పొరేషన్ ద్వారా విడుతల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 65 వేల మందికి పైగా గీత వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 3,100 రక్షణ కిట్లను అందజేశారు. గీత కార్మికులు చెట్లు ఎక్కినప్పుడు కిందపడకుండా మోకు జారకుండా ఉండేందుకు ధృడమైన బెల్టు, తాడు, మరో మూడు క్లిప్పులున్నాయి. వీటిపై సరైన అవగాహన లేక కొంతమంది పాత వాటినే వాడుతూ మృత్యువాత పడుతున్నారు. మరిన్ని రక్షణ కవచ కిట్లను మంజూరు చేయాలని, వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని కార్మిక సంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పెండింగ్ పరిహారం ఇవ్వాలి..
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. తా టి చెట్టుపై నుంచి పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చినట్లుగానే వృత్తికి దూరమైన కార్మికులకు సంపూర్ణ పరిహారం అందించాలి. మెడికల్ బోర్డును సంస్కరించాలి.
– గౌని సాంబయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి
ప్రమాదాల బారిన పడుతున్న
గీత కార్మికులు
ప్రభుత్వ సాయం అందక అవస్థలు
సహజ బీమా వర్తింపజేయాలని కార్మికుల డిమాండ్
బీమా వర్తింపజేయాలి..
రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్నట్లుగా కల్లుగీత కార్మికులకు సహజ బీమాను వర్తింపజేయాలి. కార్మికులు ఎలా మృతి చెందినా ఆ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక బీమా పాలసీని అమలు చేసి గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.
– బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు


