మక్క రైతు చిత్తు! | - | Sakshi
Sakshi News home page

మక్క రైతు చిత్తు!

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో పత్తి పంట నవంబర్‌లో కురిసిన వర్షాలకు దెబ్బతింది. దీంతో రైతులు మొక్కజొన్న సాగు చేపట్టారు. యాసంగిలో 1,05,238 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి తోడు గతంలో ఎకరానికి 25నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 40 క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేయడం, అక్కడ రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో చేసేదేమీ లేక రైతులు తక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు.

అరకొరగా కొనుగోలు కేంద్రాలు..

జిల్లాలో మొక్కజొన్న సాగు పెరిగింది. దిగుబడి కూడా అంచనాకు మించి వచ్చింది. కానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఆరకొరగానే ఉన్నా యి. గత వానాకాలం నాలుగు కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం వీటిని 16కు పెంచామని చెబుతున్న అధికారులు పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో కోసిన మొక్కజొన్నలు ఆరబోసి.. అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులను చూస్తూ బిక్కు బిక్కుమంటున్నారు.

పరిమితి పేరుతో కొర్రీలు..

రైతులు పండించిన ప్రతీ గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతు న్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. జిల్లాలో మొత్తం సాగుచేసిన మొక్కజొన్నలో 50శాతం విత్తన కంపెనీలకు, మరో 25శాతం ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మకాలు పోను కేవలం 25శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో కూడా ఎకరానికి 26.5 క్వింటాళ్ల చొప్పున పంటల నమోదు ఆధారంగా కొంటామని కొర్రీలు పెడుతున్నారు. దీంతో అధిక దిగుబడి వచ్చిన రైతులతో పాటు, కౌలు రైతులు పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదే అదునుగా ప్రైవేట్‌ దోపిడీ..

మార్క్‌ఫెడ్‌ అధికారులు సకాలంలో మొక్కజొన్నలు కొనుగోలు చేయడంలేదు. దీనికి తోడు నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలి. కానీ, అలా చేయకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 మాత్రమే ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. సరుకు ఎక్కువగా వస్తే ఈ ధర మరింత తగ్గించి కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మార్క్‌ఫెడ్‌ అధికారులను వివరణ కోరగా పరిమితికి మించి మక్కల కొనుగోళ్ల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు కొనుగోళ్లు చేపడుతామని చెప్పారు.

అరకొరగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

కొనుగోళ్లలో అధికారుల కొర్రీలు

ప్రైవేట్‌గా విక్రయించుకుంటున్న రైతులు

ఇదే అదునుగా దోచుకుంటున్న వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement