మహబూబాబాద్: అంగన్‌వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, పోషణ్ అభియాన్ కోఅర్డినేటర్లకు ఐదేళ్లకోసారి సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లాకు సెల్‌ఫోన్లను సరఫరా చేసింది. వాటి పంపిణీకి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం ముందుగా వయోవృద్ధుల కోసం ఏర్పా టు చేసిన మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌ను మంత్రి సీతక్క ప్రారంభిస్తారని, ఆతర్వాత సెల్‌ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
1,437 అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,437 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్, గార్ల, కురవి మండలాలు, గూడూరు ప్రాజెక్ట్ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ మండలాలు, మానుకోట ప్రాజెక్ట్ పరిధిలో మానుకోట, కేసముద్రం, బయ్యారం మండలాలు, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట మండలాలు ఉన్నాయి. తొర్రూరు ప్రాజెక్ట్ పరిధిలో నెల్లికుదురు, తొర్రూరు, పెద్దవంగర మండలాలు ఉన్నాయి.
వెంటాడుతున్న సిబ్బంది కొరత..
జిల్లాకు రెగ్యులర్ డీడబ్ల్యూఓ ఉండగా.. ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లకు గాను తొర్రూరు, గూడూరు సీడీపీఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే 1,437అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 1,313 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. 954 మంది ఆయాలు ఉండగా.. మిగిలిన అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 58మంది సూపర్‌వైజర్లకు గాను 51 మంది మాత్రమే ఉన్నారు. ఆయా పోస్టుల ఖాళీలతో కేంద్రాల నిర్వహణ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది.
జిల్లాకు 1,368 సెల్‌ఫోన్లు..
2019లో ఐసీడీఎస్ సిబ్బందికి సెల్‌ఫోన్లు అందజేశారు. కాగా, 2024లో ఇవ్వాల్సి ఉండగా.. ఏడాది ఆలస్యంగా ప్రస్తుతం అందజేస్తున్నారు. ఈమేరకు జిల్లాకు 1,368 సెల్‌ఫోన్లు సరఫరా చేశారు. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన సెల్ ఫోన్‌తో పాటు చార్జర్, మొబైల్ పౌచ్, వాటర్ ప్రూ పౌచ్ మరొకటి సరఫరా చేశారు. ప్రధానంగా ఎన్‌హెచ్‌టీఎస్, పోషణ్ ట్రాకర్ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. దానిలో గర్భిణులు, బాలింతలు, పిల్లల రిజిస్ట్రేషన్లు, రోజువారి హాజరు, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అన్ని నమోదు చేయాలి. హెల్త్, న్యూట్రిషన్, టీహెచ్‌ఆర్ ఇతర వివరాలు అన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా పాత సెల్‌ఫోన్‌లతో అంగన్‌వాడీలు ఇబ్బందులు పడ్డారు.
నేడు పంపిణీ..
జిల్లా కేంద్రంలో గురువారం మందుగా మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌ను మంత్రి సీతక్క ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లకు కొత్త సెల్‌ఫోన్లు, సంబంధిత సామగ్రిని పంపిణీ చేస్తారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లాకు సరఫరా చేసిన సెల్‌ఫోన్లను గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేస్తాం. అందుకు ఏర్పాట్లు చేశాం. అలాగే మంత్రి మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మంత్రితో పాటు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాం. కొత్త సెల్‌ఫోన్లతో అంగన్‌వాడీలకు చాలా వరకు యాప్‌లలో తలెత్తుతున్న సమస్యలు తీరుతాయి. అందరికీ సమాచారం ఇచ్చాం.
– సబిత, డీడబ్ల్యూఓ
జిల్లాకు 1,368 సరఫరా
నేడు మంత్రి చేతుల మీదుగా పంపిణీ
సిబ్బందికి తీరనున్న యాప్ కష్టాలు


