పెద్దచెరువుపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

పెద్దచెరువుపై చిన్నచూపు

Apr 9 2026 7:41 AM | Updated on Apr 9 2026 7:41 AM

బయ్యారం: కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్దచెరువును పాలకులు పట్టించుకోవ డం లేదు. గోదావరి జలాలు తరలించే ప్రతిపాదన వచ్చినప్పటికీ కొందరి స్వార్థం వల్ల మరోదారిలో ఖమ్మం జిల్లాకు తరలుతున్నాయి. అనేక సంవత్సరాలుగా బయ్యారం పెద్దచెరువుపై పాలకులు వివక్ష చూపుతున్నన్నారు. అయితే ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడంతో బయ్యారం, గార్ల మండలాల రైతాంగం నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని కల సమయంలో బయ్యారం పెద్దచెరువును ప్రచా రాస్త్రంగా తీసుకుంటున్న రాజకీయపార్టీల నాయకులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే నిధులు.. స్వరాష్ట్రంలో నిల్‌..

కాకతీయరాణి బయ్యమాంబ పాలనలో గుట్టలను కట్టలుగా చేసుకొని బయ్యారం పెద్ద చెరువు నిర్మించారు. కాగా, రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చిన బయ్యారం పెద్దచెరువుతో పాటు, గార్ల చెరువు రైతులకు మాత్రం పంటలు పండేవి. ఈ క్రమంలో 2006లో వచ్చిన భారీ వరదలతో చెరువుకట్టకు గండిపడింది. దీంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి చెరువుకట్ట నిర్మాణంతో పాటు కాల్వల లైనింగ్‌కు రూ.11కోట్లు మంజూరు చేశారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కట్టపనులు పూర్తి అయినప్పటికీ కాల్వల పనులు పూర్తికాలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రతీ ఏడాది కాల్వల పూడికతీత పనులు తప్ప ఇతర పనులకు నిధులు విడుదల కాలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రతిపాదనలు తలకిందులు చేసి పాలేరుకు నీళ్లు..

బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014లో భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి రోళ్లపాడుకు గోదావరి జలాలను తీసుకొచ్చి రిజర్వాయర్‌ చేస్తామన్నారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా బయ్యారం పెద్దచెరువులోకి నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. బయ్యారం పెద్దచెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా చేసి గ్రావిటీ కెనాల్‌ ద్వారా కురవి, డోర్నకల్‌ మండలాల మీదుగా పాలేరు నియోజకవర్గానికి నీరందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో చెరువు ఆయకట్టు పరిధిలోని బయ్యారం, గార్ల మండలాల రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. అయితే సీఎం స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న ప్రస్తుత మంత్రి రోళ్లపాడుకు గోదావరిజలాలు రాకుండా చక్రం తిప్పి పాలేరుకు మరో దారిగుండా నీటిని తరలించే ప్రయత్నం చేయడంతో బయ్యారం, గార్ల మండలాల రైతులకు నిరాశే మిగిలింది.

మభ్యపెడుతున్న నేతలు..

గత ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై నిర్వహించిన దీక్షకు ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరిజలాలు తీసుకుస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా.. చెరువుకు నీటిని తీసుకొచ్చే అంశంపై ముందడుగు వేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై పాలకులు దృష్టిపెట్టాలని బయ్యారం, గార్ల మండలాల రైతులు కోరుతున్నారు.

గోదావరి నీళ్లు తీసుకురావాలి..

చెరువు ఆయకట్టు చివరిలో మా భూమి ఉంది. రెండుసార్లు చెరువు నిండితేనే మా పంటలు పండుతాయి. ఒక్కో ఏడు వానలు పడకపోతే చివరిలో ఉన్న మా పంటలకు నీళ్లు రాక ఎండిపోతాయి. చెరువుకు గోదావరి నీళ్లు తీసుకొస్తే సాగు చేసిన పంటకు చివరితడి అందుతుందనే ధైర్యం వస్తుంది.

– సపావట్‌ లక్ష్మణ్‌, సంగ్యాతండా

బయ్యారం చెరువుకు గోదావరి నీళ్ల తరలింపులో నిర్లక్ష్యం

ఎన్నికల సమయంలో హామీల పర్వం

రిజర్వాయర్‌ చేస్తే బయ్యారం, గార్ల మండలాలు సస్యశ్యామలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement